జవహర్ నవోదయ విద్యాలయాలు- ప్రతిభకు పట్టం

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో కూడిన విద్యను మారుమూల గ్రామీణ ప్రాంతాల వారికి కూడా అందించాలనే జాతీయ విద్యా విధానం (1986) సూచనలకు అనుగుణంగా భారత ప్రభుత్వం జవహర్ నవోదయ విద్యాలయాల (జేఎన్‌వీ) కు శ్రీకారం చుట్టింది. ప్రతి జిల్లాలోను ఒక నవోదయ విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి 1986లోనే చర్యలు ప్రారంభించింది. ఫలితంగా ప్రస్తుతం వీటి సంఖ్య 27 రాష్ట్రాల్లో, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 595కు చేరుకుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 24 విద్యాలయాలు ఉన్నాయి. కో - ఎడ్యుకేషన్ విధానంలో సాగే ఈ సంస్థలను పర్యవేక్షించడానికి కేంద్రం నవోదయ విద్యాలయ సమితి పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.

ఈ సంస్థల్లో ఎలా చేరాలి? ఏ తరగతులను నిర్వహిస్తున్నారు, ప్రవేశ విధానం ఎలా ఉంటుంది? తదితర అంశాల గురించిన వివరాలు... 
ఎన్ని సీట్లు ఉంటాయి?

ఒక్క్కొ విద్యాలయంలో 80 సీట్లు ఉంటాయి. వీటిలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల వారికి, 25 శాతం పట్టణ ప్రాంతాల వారికి కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 1/3వ వంతు సీట్లను బాలికలకు కేటాయిస్తారు. 

ప్రత్యేకత: అన్నీ ఉచితం

నవోదయ విద్యా సంస్థల్లో ఒక్కసారి ప్రవేశం పొందితే పుస్తకాల దగ్గర నుంచి అన్నీ ఉచితంగానే లభిస్తాయి. విద్యార్థి చదువుకున్నంత కాలం విద్యా బోధనతోపాటు వసతి, ఆహారం, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్ ఉచితంగా ఇస్తారు. తెలుగు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో శిక్షణ నిర్వహిస్తారు. వీటితోపాటు క్రీడలు, యోగా, ఎన్‌సీసీ, సంగీతం, చిత్రకళ తదితర రంగాల్లో కూడా శిక్షణ ఇస్తారు. కంప్యూటర్ విద్యతోపాటు, వీశాట్, ఎడ్యుసొసైటీ కనెక్టివిటీ, ఇంటర్‌నెట్, లైబ్రరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. బాల బాలికలకు విడివిడిగా వసతి సౌకర్యం ఉంటుంది.

ఏ తరగతులను నిర్వహిస్తారు? 

నవోదయ విద్యా సంస్థల్లో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నిర్వహిస్తారు.

బోధన ఎలా ఉంటుంది? 

ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థి మాతృభాషలోనే బోధన జరుగుతుంది. తర్వాత నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉంటుంది. జేఎన్‌వీలలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు సీబీఎస్ఈ నిర్వహించే టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరు కావచ్చు.

అర్హతలు ఏమిటి? 

ఆరో తరగతి నుంచి ప్రవేశాలు ప్రారంభమవుతాయి కాబట్టి విద్యార్థి ప్రస్తుత విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతుండాలి. గ్రామీణ కోటా కింద ప్రవేశం పొందాలంటే గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలలో మూడు, నాలుగు, అయిదు తరగతులు ఉత్తీర్ణులై ఉండాలి. ఆరో తరగతిలో ప్రవేశం పొందిన వారు వరుసగా 12వ తరగతి వరకు చదువుకోవచ్చు.

ప్రవేశ మార్గం - జేఎన్‌వీ సెలక్షన్ టెస్ట్:

 

నవోదయ విద్యా సంస్థల్లో తొలి అడుగు ఆరో తరగతి నుంచి ప్రారంభమవుతుంది. దీన్లో చేరేందుకు జవహర్ నవోదయ సెలక్షన్ టెస్ట్ (జేఎన్‌వీఎస్‌టీ) పేరుతో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులను చేర్చుకుంటారు.

పరీక్ష ఎన్ని భాషల్లో జరుగుతుంది?

విద్యార్థి 5వ తరగతి ఏ భాషలో చదువుతున్నాడో అదే భాషలో ఈ పరీక్ష రాయవచ్చు. మొత్తం 21 భాషల్లో ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. విద్యార్థి దరఖాస్తులో ఏ భాషలో సూచిస్తే అదే భాషకు చెందిన ప్రశ్నపత్రాన్ని ఇస్తారు.

పరీక్ష విధానం: సెలెక్షన్ టెస్ట్ పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. దీన్లో మూడు విభాగాలు ఉంటాయి.. 
విభాగం
ప్రశ్నలు
మార్కులు
సమయం
1) మెంటల్ ఎబిలిటీ టెస్ట్
50
50
60 నిమిషాలు.
2) అరిథ్‌మెటిక్ టెస్ట్
25
25
30
3) లాంగ్వేజ్ టెస్ట్
25
25
30

మొత్తం - 100 ప్రశ్నలు - 100 మార్కులు - 2 గంటలు. 

నోట్: పరీక్షలో బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్‌ను మాత్రమే వాడాలి. పెన్సిల్స్ నిషిద్ధం. నెగిటివ్ మార్కులు లేవు.

సిలబస్, ప్రిపరేషన్ విధానం:

మొదట అన్ని విభాగాలను నిశితంగా చదవాలి. ఏ విభాగం క్లిష్టంగా ఉంది, ఏ విభాగం సులుభంగా అర్ధమవుతోందో గమనించాలి. తర్వాత ఆయా సబ్జెక్టులను ప్రాధాన్యక్రమంలో చదవాలి. దీనికోసం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సాయంతో తగిన ప్రణాళిక రూపొందించుకోవాలి. తద్వారా పరీక్ష సమయానికి అన్ని అంశాల్లో పరిపూర్ణత సాధించవచ్చు.

1) మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (మ్యాట్)

ఇది పూర్తి నాన్ -వెర్బల్ టెస్ట్. ఫిగర్స్, డయాగ్రమ్స్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి. విద్యార్థి మానసిక సామర్థ్యాన్ని, సమస్య పరిష్కారంలో చూపించే ఆలోచనా విధానాన్ని పరిశీలించడమే ఈ విభాగం ముఖ్య ఉద్దేశం. దీన్లో మంచి మార్కుల సాధన కోసం మార్కెట్లో లభించే ప్రామాణిక మెంటల్ ఎబిలిటీ పుస్తకాలను చదవాలి. ఫిగర్స్, డయాగ్రమ్స్ మోడల్ పిక్చర్లలో స్వల్ప తేడాలు ఉంటాయి. వీటిని గమనించాలంటే ప్రాక్టీస్ తప్పనిసరి. పెద్ద పెద్ద డయాగ్రమ్స్‌లో ఉండే తేడాలను గుర్తించాలంటే మొదట చిన్న చిన్న డయాగ్రమ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా అవగాహనా శక్తి, వేగం పెరుగుతాయి. దీంతో పరీక్షలో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించగలుగుతారు.

2) అరిథ్‌మెటిక్ టెస్ట్

విద్యార్థి చదువుతున్న 5వ తరగతి మ్యాథ్స్ సిలబస్‌కు చెందిన సంఖ్యలు, మొత్తం సంఖ్యల నాలుగు ప్రాథమిక భావనలు, కారణాంకాలు, భిన్నాలు వాటి ప్రాథమిక భావనలు, కసాగు, గసాభా, శాతాలు, కొలతలు, దూరం, కాలం, వేగం, సగటు అంచనా, శాతాలు, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ మొదలైనవి అరిథ్‌మెటిక్ టెస్ట్ కిందకు వస్తాయి.

ఈ విభాగంలో మంచి మార్కుల కోసం ప్రాథమిక భావనలపై పూర్తి పట్టు సాధించాలి. దీనికోసం మూడో తరగతి నుంచి చదివిన మ్యాథ్స్ సబ్జెకులను పూర్తిగా చదవాలి. ఒక్కొక్క విభాగాన్ని పరీక్ష తేదీకి అనుగుణంగా విభజించుకుని ప్రాక్టీస్ చేయాలి. మోడల్ ప్రశ్నలు సాధన చేయడం ద్వారా అరిథ్‌మెటిక్ టెస్ట్‌లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. దీనికోసం మూడు, నాలుగు, అయిదు తరగతుల మ్యాథ్స్ సబ్జెక్టులపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. నిర్ణీత సమయాన్ని కేటాయించి ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలనే విషయాన్ని మరిచిపోకూడదు.

3) లాంగ్వేజ్ టెస్ట్:

విద్యార్థి ఇంగ్లిష్ రీడింగ్ కాంప్రహెన్షన్ సామర్థ్యాన్ని పరిశీలించడమే ఈ పరీక్ష ఉద్దేశం. దీన్లో మూడు వ్యాసాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 5 ప్రశ్నలు ఉంటాయి. దీనికి అదనంగా ఇంగ్లిష్ గ్రామర్, రైటింగ్ స్కిల్స్‌పై 10 ప్రశ్నలు ఉంటాయి. దీన్లో అధిక మార్కులు సాధించడానికి ప్యాసేజీలను బాగా ప్రాక్టీస్ చేయాలి. వ్యాసం మీద పూర్తి పట్టు రావడానికి మొదట మొత్తం వ్యాసాన్ని చదవాలి. తర్వాత మళ్లీ చదివి ప్రశ్నలను గమనించాలి. ఎన్ని ప్రశ్నలకు సమాధానాన్ని గుర్తించగలరో గ్రహించాలి. ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేయడం ద్వారా అవగాహన శక్తి పెరుగుతుంది. సమాధానాన్ని కూడా వేగంగా గుర్తించడం అలవడుతుంది. అలాగే మూడు, నాలుగు, అయిదు ఇంగ్లిష్ సబ్జెక్టుల్లోని గ్రామర్ పాయింట్లపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. ఈ విధమైన ప్రాక్టీస్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు నివ్వాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు పరీక్ష తేదీని గుర్తుపెట్టుకుని విద్యార్థి స్థాయిని గమనించి నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించాలి. దీని ప్రకారం విద్యార్థిని తీర్చిదిద్దాలి. పరీక్ష సమీపించే కొద్దీ ఎక్కువ సమయాన్ని మోడల్ పేపర్ల సాధనకే కేటాయించడం అవసరం. దీనివల్ల పరీక్షలో సమయాన్ని ఎలా ఆదా చేసుకోవచ్చో బాగా అర్దమవుతుంది. మంచి మార్కులు సంపాదించి సీటుపొందవచ్చు.

నోట్: 2013-14 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి రాత పరీక్ష 2013 ఫిబ్రవరి 10న జరుగుతుంది. దరఖాస్తు గడువు అక్టోబరు 31తో ముగిసింది.


                                                                                                      
                                                                                                             
 

Powered By: Mahesh