ప్రిపరేషన్ పద్ధతి

దేశ రక్షణలో యువతను భాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 1961లో సైనిక పాఠశాలలకు
(సైనిక్ స్కూల్స్)కు శ్రీకారం చుట్టింది. వీటిలో కేవలం బాలురకు మాత్రమే ప్రవేశం కల్పించి వారిని మానసికంగా,
శారీరకంగా, విద్యాపరంగా సుశిక్షితులను చేయడం ఈ స్కూల్స్ ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. దీనికోసం దేశవ్యాప్తంగా
24 సైనిక స్కూళ్లను ప్రారంభించారు. ఈ స్కూళ్లలో 12వ తరగతి వరకు బోధన జరుగుతుంది. తర్వాత వీరిని
పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లో ప్రవేశం పొందడానికి యూపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షకు
సిద్ధమయ్యే విధంగా తీర్చిదిద్దుతారు.
ఆంధ్రప్రదేశ్‌లో.. కోరుకొండ
సైనిక స్కూళ్ల ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోరుకొండలో ఒక స్కూల్‌ను ఏర్పాటు
చేశారు. ఇది 1962 జనవరి 18 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. త్వరలో చిత్తూరు జిల్లాలో కూడా
మరొక సైనిక స్కూల్ ఏర్పాటు కానుంది.
సైనిక పాఠశాలల్లో చేరడానికి ఏం చేయాలి? ఏ తరగతులకు శిక్షణ ఇస్తారు? ఎలాంటి అర్హతలు ఉండాలి, స్కాలర్‌షిప్‌లు
తదితర వివరాల గురించి తెలుసుకుందాం...
ఏ తరగతులకు ప్రవేశం లభిస్తుంది?
వీటిలో 6, 9 తరగతులకు ప్రవేశం కల్పిస్తారు. ఇంటర్ వరకు బోధన ఉంటుంది. ఒక్కసారి ఆరు లేదా తొమ్మిదో
తరగతిలో చేరితే చాలు ఇంటర్ పూర్తిచేసే వరకూ చదువు కొనసాగించవచ్చు. మొదట ఆల్ఇండియా
సెకండరీ స్కూల్ఎడ్యుకేషన్ (టెన్త్‌క్లాస్), తర్వాత ఆల్ ఇండియా సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఇంటర్)కు
వీరిని సిద్ధం చేస్తారు. ఇంటర్ తర్వాత వీరిని పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరేందుకు అర్హత కల్పించే
పరీక్షకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తారు. ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. విద్యార్జనలో భాగంగా
ఎన్‌సీసీ అందరికీ తప్పనిసరి.
అర్హులు: ఈ పాఠశాలల్లో చేరేందుకు కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఎన్ని సీట్లు ఉన్నాయి?
ఆరో తరగతికి 65 సీట్లు, తొమ్మిదో తరగతికి 25 సీట్లు ఉన్నాయి. వీటిలో 67 శాతం సీట్లను ఆయా రాష్ట్రాల
స్థానికులకు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 15 శాతం ఎస్సీలకు, 7.5 శాతం ఎస్టీలకు, 25 శాతం డిఫెన్స్
వారికి కేటాయిస్తారు.
ఎలా చేరాలి?
సైనిక స్కూల్లో 6, 9 తరగతుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనికి ప్రతి సంవత్సరం అక్టోబరు
లేదా నవంబరులో నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీన్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.
ఇక్కడ కూడా రాణిస్తే తుది ఎంపిక పూర్తవుతుంది.
ఎన్నిసార్లు రాయవచ్చు?
ఈ పరీక్ష రాసేందుకు విద్యార్థికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇస్తారు. దీన్లో ఫెయిల్ అయితే మరోసారి రాసే వీలు లేదు.
పరీక్ష కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి?
రాష్ట్రంలో గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, తిరుపతి, విశాఖపట్నంలలో ఈ పరీక్ష జరుగుతుంది.
 
ఆరో తరగతిలో ప్రవేశం
ప్రవేశ సంవత్సరం జులై 1 నాటికి విద్యార్థికి 10 సంవత్సరాలు నిండి ఉండాలి. 11 సంవత్సరాలు దాటకూడదు. ప్రవేశం పొందే నాటికి అయిదో తరగతి ఉత్తీర్ణుడు కావాలి. 
పరీక్షను స్థానిక భాషలో రాయవచ్చా?

ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్షను ఇంగ్లిష్ లేదా మరే ఇతర భారతీయ భాషలోనైనా రాయవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలుగులో కూడా రాయవచ్చు. పరీక్ష పేపర్‌ను దరఖాస్తులో విద్యార్థి సూచించిన భాషలోనే ఇస్తారు. కాబట్టి తాను ఏ భాషలో రాయాలనుకుంటున్నాడో ఆ వివరాలను దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది.
ప్రవేశ పరీక్ష విధానం ఏమిటి?
దీన్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. అవి...
పేపర్ -1: మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్ 
(పేపర్ -2) - 200 మార్కులు
పేపర్ -3: ఇంటెలిజెన్స్ - 100 మార్కులు
మొత్తం - 300 మార్కులు

ఎన్ని మార్కులు రావాలి?
జనరల్‌కేటగిరీ అభ్యర్థులు ప్రతి పేపర్‌లో కనీసం 25 శాతం మార్కులు తెచ్చుకోవాలి. సగటున 40 శాతం
మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు మార్కుల నిబంధనలు లేవు.
ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్యూకు
50 మార్కులు కేటాయించారు. మొత్తం మార్కుల ఆధారంగా స్కూల్లో చేర్చుకుంటారు.
సిలబస్- ప్రిపరేషన్ టెక్నిక్స్
సీబీఎస్సీ విధానంలో 5వ తరగతి సిలబస్‌ను పరీక్షకు ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి విద్యార్థులు
సీబీఎస్ఈ 5వ తరగతి పాఠ్యపుస్తకాలను బాగా చదవాల్సి ఉంటుంది.
సిలబస్ వివరాలు...
1) ఇంగ్లిష్:
దీన్లో ఎస్సే రైటింగ్, కాంప్రహెన్షన్, ఒకాబ్యులరీ అండ్ యూసేజ్, జెండర్, యాంటోనిమ్స్, సినానిమ్స్,
సెంటెన్స్ టైప్స్, రీ అరేంజింగ్ వర్డ్స్, వెర్బ్ ఫామ్స్, ఎడ్జెక్టివ్, నౌన్స్, యాడ్‌వెర్బ్స్, గ్రమాటికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి.
ప్రిపరేషన్: సీబీఎస్ఈ 5వ తరగతి ఇంగ్లిష్ టెక్స్ట్‌బుక్ మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో చదివేందుకు తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులు విద్యార్థికి తోడ్పడాలి. పరీక్ష తేదీని దృష్టిలో పెట్టుకుని సమయాన్ని ఎలా కేటాయించాలో పటిష్టమైన
ప్రణాళిక రూపొందించాలి. దాని ప్రకారం విద్యార్థి చదివేందుకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలి. సిలబస్
మొత్తం పూర్తి చేసిన తర్వాత బిట్ పేపర్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఏ అంశంలో సులభంగా మార్కులు
వస్తున్నాయో, ఎక్కడ ఇబ్బంది ఎదురవుతోందో తెలుస్తుంది. తర్వాత వాటిని కూలంకషంగా చదివి మరింత
అవగాహన పెంచుకోవాలి. దీనివల్ల పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
సులభంగా సమాధానాలు ఇవ్వగలుగుతారు.
2) మ్యాథమెటిక్స్:
దీన్లో నంబర్ సిస్టమ్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, కమర్షియల్ మ్యాథమెటిక్స్ (పర్సెంటీజీలు, ప్రాఫిట్ అండ్ లాస్,
రేషియో అండ్‌ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్), క్యాష్ బిల్స్ ప్రిపరేషన్, టెంపరేచర్ మెజర్‌మెంట్ ఉంటాయి.
అలాగే మెన్సురేషన్, జామెట్రీ (ప్రాథమిక భావనలు) ఉంటాయి.
ప్రిపరేషన్ టెక్నిక్స్: ఇక్కడ కూడా విద్యార్థికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన నిర్దిష్ట ప్రణాళికను అందించడం
వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ సబ్జెక్టుకు ప్రాక్టికల్ వర్క్ చాలా అవసరం కాబట్టి సీబీఎస్‌సీ 5వ తరగతి
మ్యాథ్స్ టెక్స్ట్ బుక్‌పై మొదట పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. తొందరగా సమాధానాలు తెచ్చుకుంటున్న
అంశాల కంటే క్లిష్టంగా ఉన్న వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లెక్కలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు
విద్యార్థికి అనేక సమస్యలు ఎదురవుతాయి. వాటి పరిష్కారానికి సంబంధిత టీచర్‌ను లేదా అనుభవజ్ఞులను
సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. సిలబస్ అంతా పూర్తి చేసిన తర్వాత బిట్ బ్యాంక్‌ను ప్రాక్టీస్ చేయడం
మరిచిపోకూడదు. దీనివల్ల వేగం పెరుగుతుంది. పరీక్షలో సమయం ఆదా అవుతుంది. తద్వారా సమాధానాలు
రాని ప్రశ్నలకు ఎక్కువ సమయాన్ని కేటాయించే వీలు కలుగుతుంది.
ఇంటెలిజెన్స్: ఇది పూర్తిగా జనరల్ టాపిక్. దీనికోసం మార్కెట్లో దొరికే మంచి ఇంటెలిజెన్స్ మెటీరియల్‌ను
సాధన చేయడం అవసరం. ఈ మెటీరియల్ ఎక్కువగా ఇంగ్లిష్‌లోనే ఉంటుంది కాబట్టి ఇంగ్లిష్ భాషపై ఎక్కువ
అవగాహన పెంచుకోవాలి. అలాగే మ్యాథమెటిక్స్ ప్రాథమిక భావనలపై కూడా పట్టు పెంచుకోవాలి.
మోడల్ పేపర్ల ప్రాక్టీస్: పరీక్ష తేదీకి నెల ముందు నుంచీ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం అవసరం. నిర్ణీత
సమయాన్ని కేటాయించి ఈ పేపర్లు చేయడం వల్ల పరీక్షలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేయాలో తెలుస్తుంది
. మంచి స్కోర్‌కు అవకాశం ఏర్పడుతుంది.
 
9వ తరగతి ప్రవేశ విధానం
దీనికి కూడా కేవలం బాలరు మాత్రమే అర్హులు.
అర్హతలు: ప్రవేశ సంవత్సరం జులై 1 నాటికి విదార్థి వయసు 13 సంవత్సరాలు నిండి ఉండాలి. 14 సంవత్సరాలు
దాటకూడదు. ప్రవేశం పొందే నాటికి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన సర్టిఫికెట్‌ను అందజేయాల్సి ఉంటుంది. ప్రవేశం
కోసం రాత పరీక్ష ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
పరీక్షలోని అంశాలు...
* పేపర్ -1: మ్యాథమెటిక్స్ అండ్
* పేపర్ -2: సైన్స్ - 275 మార్కులు.
* పేపర్ -3: ఇంగ్లిష్ అండ్
* పేపర్ -4: సోషల్‌సైన్స్ - 175 మార్కులు.
మొత్తం మార్కులు - 450
ఎన్ని మార్కులు రావాలి?
జనరల్‌కేటగిరీ అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 25 శాతం మార్కులు తెచ్చుకోవాలి. సగటున 40 శాతం మార్కులు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు మార్కుల నిబంధనలు లేవు.
ఇంటర్వ్యూ:
రాత పరీక్షలో ప్రతిభ చూపిన వారికి 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్యూకు 50 మార్కులు కేటాయించారు.
సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
సిలబస్ - ప్రిపరేషన్ విధానం
సీబీఎస్ఈ 8వ తరగతి సిలబస్ ఆధారంగా ఈ పేపర్‌ను రూపొందిస్తారు. కాబట్టి విద్యార్థులు సీబీఎస్ఈ 8వ తరగతి సిలబస్‌పై
పూర్తి అవగాహన ఏర్పర్చుకునే విధంగా సాధన చేయాలి. వివరాలు...
1) సోషల్ స్టడీస్ (హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ), జీకే.:
* హిస్టరీ విభాగం కింద మోడరన్ ఇండియన్‌హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ రివల్యూషన్స్,
ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండస్ట్రియల్ రివల్యూషన్, హెరిజేట్ సైట్స్ - ఇండియా, వరల్డ్ ఉంటాయి.
* సివిక్స్‌లో ఫండమెంటల్ రైట్స్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్ సిస్టమ్, ప్రెసిడెంట్ శాలరీస్, యూఎన్‌వో,
హ్యూమన్ రైట్స్, గ్లోబలైజేషన్ ఉంటాయి.
* జాగ్రఫీ -ఫిజికల్ జాగ్రఫీలో సోలార్ సిస్టమ్, సాయిల్ టైప్స్, రాక్ సిస్టమ్, సునామీ, జియోగ్రాఫికల్ టెర్మినాలజీ -
ఇండియా, వరల్డ్ ఉంటాయి. ఇండియన్ జాగ్రఫీలో రివర్స్ ఆఫ్ ఇండియా, ఫెస్టివల్స్, స్టేట్స్, క్యాపిటల్స్ తదితరాలు
ఉంటాయి. వరల్డ్ జాగ్రఫీలో జియోగ్రాఫికల్ సర్‌నేమ్స్, కంట్రీస్ అండ్‌క్యాపిటల్స్ మొదలైనవి ఉంటాయి.
ప్రిపరేషన్:
ఈ విభాగంలో పట్టు సాధించేందుకు ప్రధానంగా 8వ తరగతి సీబీఎస్ఈ సోషల్ స్టడీస్ పాఠ్య పుస్తకాన్ని బాగా చదవాలి.
ముఖ్యమైన పాయింట్లపై విడిగా నోట్స్ తయారు చేసుకోవాలి. విద్యార్థి ఈ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవడానికి
క్లాస్ టీచర్లను, తల్లిదండ్రులను సంప్రదించాలి. ముఖ్యమైన టాపిక్‌లపై ప్రత్యేకంగా బిట్ బ్యాంక్ తయారు చేసుకోవడం మంచిది.
సిలబస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు బిట్ బ్యాంక్, మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేయడం అవసరం.
మోడల్ పేపర్లు చేస్తున్నప్పుడు ఏ అంశాలను సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోతున్నారో తెలుస్తుంది. వాటిని పునర్విభజన
చేసి పూర్తిస్థాయి పట్టు సాధించవచ్చు.
* రిఫరెన్స్ బుక్స్ - సీబీఎస్‌సీ 8వ తరగతి సోషల్ స్టడీస్
* జనరల్‌నాలెడ్జ్ (జీకే): ఈ విభాగంపై పూర్తి అవగాహన పెంచుకోవడానికి మార్కెట్లో లభించే ప్రామాణిక జీకే పుస్తకాలను
చదవాలి. రోజువారీ పత్రికలను కూడా చదువుతూ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ముఖ్యమైన
సంఘటనలపై విడిగా నోట్స్ తయారు చేసుకోవడం మంచిది. బిట్ బ్యాంక్‌లను, మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలనే
విషయాన్ని మరిచిపోకూడదు.
2) సైన్స్:
దీన్లో యూనివర్స్, సాయిల్, ఎయిర్, ఆటమ్ స్ట్రక్చర్, మెటల్స్ అండ్‌నాన్ -మెటల్స్, మైక్రో ఆర్గానిజమ్స్, సెల్ స్ట్రక్చర్,
లైట్ రిఫ్రాక్షన్, ఎనర్జీ సోర్సెస్, కామన్ డిసీజెస్, ఫుడ్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ఉంటాయి.
ప్రిపరేషన్: ఈ విభాగంలో మంచి మార్కులు స్కోర్‌చేయడానికి సీబీఎస్ఈ 8వ తరగతి సైన్స్ పాఠ్యపుస్తకాన్ని బాగా చదవాలి
ప్రధానమైన పాయింట్లపై విడిగా నోట్స్ తయారు చేసుకోవాలి. పాఠ్యాంశం చివర్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలను రాయాలి.
బిట్ బ్యాంక్‌లను ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. 
రిఫరెన్స్ - సీబీఎస్ఈ 8వ తరగతి సైన్స్.
3) ఇంగ్లిష్:
ఈ విభాగంలో కాంప్రహెన్షన్ గైడ్‌రైటింగ్, ఒకాబ్యులరీ అండ్‌యూసేజ్, యాంటోనిమ్స్, సెంటెన్స్ టైప్స్, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్స్,
ఫ్యూచర్‌టైమ్ రిఫరెన్స్, సినానిమ్స్, ఎస్సే రైటింగ్, టెన్సెస్, ప్రిపోజిషన్స్ గ్రమాటికల్ స్ట్రక్చర్ తదితరాలు ఉంటాయి.
ప్రిపరేషన్: సీబీఎస్ఈ 8వ తరగతి ఇంగ్లిష్ టెక్స్ట్‌బుక్ మొత్తాన్ని ఒక క్రమ పద్ధతిలో చదవాలి. దీనికోసం విద్యార్థికి టీచర్లు,
తల్లిదండ్రులు అవసరమైన గైడెన్స్ ఇవ్వాలి. విద్యార్థి 7వ తరగతి వరకు ఇంగ్లిష్ కూడా ఒక సబ్జెక్టుగా చదివి ఉంటాడు
కాబట్టి సిలబస్ మీద కొంత అవగాహన వచ్చి ఉంటుంది. ఇప్పుడు పరీక్ష కోణంలో చదవాలి కాబట్టి 8వ తరగతి సిలబస్
మీద ఎక్కువ శ్రద్ధ చూపాలి. కాంప్రహెన్షన్, టెన్సెస్ తదితర అంశాలపై పూర్తి అవగాహనకు ఎక్కువ సమయం కేటాయించడం
అవసరం. సిలబస్ మొత్తం పూర్తిచేసి బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడం అవసరం. దీనివల్ల ఇంగ్లిష్ పేపర్ మీద మంచి పట్టు వస్తుంది.
రిఫరెన్స్: సీబీఎస్ఈ - 8వ తరగతి ఇంగ్లిష్.
4) మ్యాథమెటిక్స్:
దీన్లో స్క్వేర్స్, క్యూబ్స్, క్యూబ్‌రూట్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డివిజన్ ఆఫ్ పాలినామియల్స్, లీనియర్ ఈక్వేషన్స్,
సర్కిల్స్, పెరిమీటర్, ట్రయాంగిల్, స్టాటిస్టిక్స్ తదితరాలున్నాయి.
ప్రిపరేషన్: ఈ విభాగంపై ఎంత అవగాహన, ప్రాక్టీస్ ఉంటే పరీక్షలో అంతగా సమయం ఆదా అవుతుంది. దీనికోసం సిలబస్ మొత్తాన్ని
బాగా చదవడంతోపాటు ప్రశ్నల సాధన బాగుండాలి. ప్రతి పాఠాన్ని బాగా చదివి ముఖ్యమైన పాయింట్లు నోట్ చేసుకోవాలి.
ముఖ్యంగా సూత్రాలను తప్పనిసరిగా విడిగా రాసుకొని, తరచూ మననం చేయడం అవసరం.
మ్యాథమెటిక్స్ పూర్తిగా ప్రాక్టీస్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి వీలైనన్నిసార్లు బిట్ బ్యాంక్ సాధన చేయాలి. ఈ ప్రయత్నంలో
సమాధానాలు రాని ప్రశ్నలను గుర్తించి వాటికి తగిన విధంగా పాఠ్యపుస్తకంలో సమాధానం ఎలా ఉందో తెలుసుకోవాలి.
లేదా టీచర్ల సాయంతో సమాధానాలను తెలుసుకోవాలి. వీటిని మళ్లీ సాధన చేయాలి.
రిఫరెన్స్ - సీబీఎస్ఈ 8వ తరగతి మ్యాథమెటిక్స్.
మోడల్ పేపర్ల సాధన అవసరం
తొమ్మిదో తరగతిలోకి నిర్వహించే ప్రవేశ పరీక్ష కొంత క్లిష్టంగా ఉంటుంది. అంతేకాదు సిలబస్ కూడా ఎక్కువ. కాబట్టి
మెటీరియల్ బాగా చదవడంతోనే సరిపోదు. మోడల్ పేపర్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష నెల ముందు నుంచే ఈ పేపర్లను
సాధన చేయడం వల్ల పేపర్ మీద పూర్తి పట్టు సాధించవచ్చు. సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఈ ప్రాక్టీస్
వల్ల అర్ధమవుతుంది. తద్వారా పరీక్షలో మంచి మార్కులు సాధించగలుగుతారు.
ప్రమోషన్ ఎలా?
విద్యార్థిని ఉన్నత తరగతిలోకి పంపాలంటే (ప్రమోషన్) ఒక్కొక్క సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి.
సగటున 50 శాతం మార్కులు ఉండాలి.
నోట్: విద్యార్థి చదువులో తగిన సామర్థ్యాన్ని ప్రదర్శించక పోయినా, ఆరోగ్యం బాగో లేకపోయినా, ప్రవర్తన సరిగా లేకపోయి
నా స్కూల్ నుంచి తిరిగి పంపించివేస్తారు.
అర్హులైన వారికి ఎలాంటి స్కాలర్‌షిప్‌లు ఇస్తారు?
సైనిక్ స్కూల్స్‌లో చేరే వారికి మెరిట్ స్కాలర్‌షిప్‌లు, ఇన్‌కం ఆధారిత స్కాలర్‌షిప్‌లు, డిఫెన్స్ స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. ఎస్సీ,
ఎస్టీలకు చెందిన బాలురకు సోషల్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్స్ అవార్డ్ స్కాలర్‌షిప్‌లు ఉంటాయి.
ప్రవేశానికి కావాల్సిన డాక్యుమెంట్లు:
* వయసును తెలిపే సర్టిఫికెట్.
* ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ ఉంటే అది.
* ప్రభుత్వ పాఠశాలల్లో చదవకపోతే మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన పుట్టిన తేదీ సర్టిఫికెట్.
* ఎక్స్ సర్వీస్‌మెన్, సర్వీస్‌లో ఉన్న వారు తమ కమాండింగ్ ఆఫీసర్ జారీ చేసిన సర్టిఫికెట్.
2013-14 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల
2013-14 విద్యా సంవత్సరానికి విజయనగరంలోని కోరుకొండ సైనిక స్కూల్‌లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశానికి
ఇటీవలే నోటిఫికేషన్ విడుదలైంది.
దరఖాస్తు: వెబ్‌సైట్/ సైనిక్ స్కూల్ నుంచి నేరుగా పొంది పూర్తి వివరాలతో పంపాలి.
ఫీజు: Principal, Sainik School, Korukonda పేరుతో రూ.475 డీడీని ఎస్‌బీఐలో చెల్లించాలి.
* దరఖాస్తులను అక్టోబరు 15 నుంచి డిసెంబరు 10 వరకు స్వీకరిస్తారు.
వెబ్‌సైట్: www.sainikschoolkorukonda.org
 
                                                                           

Powered By: Mahesh