ఏపీపీఎస్సీ గ్రూప్ -1 మెయిన్స్ కటాఫ్ ఎంత?

అనుకున్న సమయానికి అనుకున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను ముగించింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణలోనూ, నాణ్యత విషయంలోనూ ఈసారి కొంత వరకు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అభ్యర్థుల్లో కటాఫ్ ఎంత ఉండవచ్చు? అనే ప్రశ్న మొదలైంది. పోటీ పరీక్షల నిపుణులు కొడాలి భవానీశంకర్ విశ్లేషణ ప్రకారం...

జనరల్ పురుష అభ్యర్థులకు కటాఫ్ 460 మార్కులకు 3 నుంచి 4 శాతం అటూ ఇటుగా ఉండవచ్చని
పేర్కొంటున్నారు. మొత్తం మీద ఈసారి పేపర్ – 1, 2, 3 ల్లో సగటు మార్కు పెరుగుతుంది.
పేపర్ – 4, 5 ల్లో సగటు మార్కు తగ్గే అవకాశం ఉంది. చివరి రెండు పేపర్ల విషయంలో అభ్యర్థులు
సంయమనం కోల్పోకుండా ప్రశ్న లోతును, అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని
సమతూకంతో జవాబులు రాసి ఉంటే పోటీలో ముందు నిలబడవచ్చు. 
పలువురు అభ్యర్థులు, పోటీపరీక్షల నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఈసారి మెయిన్స్ పరీక్షలు
తగిన స్థాయిలో, సంతృప్తికరంగా సాగినట్లు తెలుస్తోంది. కాఠిన్యస్థాయి అభ్యర్థుల నాలెడ్జ్ ని పరీక్షించే
విధంగానే ఉందని చెబుతున్నారు. స్థూలమైన అవగాహన ఉన్న అభ్యర్థులు మంచి మార్కులు పొందే
అవకాశం ఉంది. ప్రశ్నలు-జవాబుల రూపంలో కంఠస్థం చేసిన వారు కొంత వెనుకబడే సూచనలు కనిపిస్తున్నాయి. 
పేపర్లవారీగా పరిశీలిస్తే.... 
పేపర్ – 1
గత పరీక్షల్లో నిరాశ పరిచిన పేపర్ – 1 ఈసారి ప్రమాణాలకు అనుగుణంగా వచ్చినట్లు అభ్యర్థులు
చెబుతున్నారు. సగటు అభ్యర్థి కూడా సంతృప్తికరంగా జవాబులు రాయగలిగిన విధంగా ఉందని పేర్కొంటున్నారు.
వర్తమానాంశాల నేపథ్యంలో లోక్ పాల్, కర్షకుల ఆత్మహత్యలు, పంచాయతీరాజ్ తదితర ప్రశ్నలు రోజూ దినపత్రికలు
చదివే అభ్యర్థులు రాయగలిగిన విధంగా ఉన్నాయి. ఈ పేపర్ లో కటాఫ్ 100 నుంచి 110 ఉండవచ్చు. 
పేపర్ – 2
ఈసారి పేపర్ – 2 లోని చరిత్ర విభాగం ప్రశ్నలు కూడా గ్రూప్ -1 స్థాయిలోనే ఉన్నాయని నిపుణులు,
అభ్యర్థులు అంటున్నారు. అకడమిక్ గా చదివిన అభ్యర్థులు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అనువర్తన కోణంలో
చరిత్రపై సంపూర్ణమైన అవగాహన కలిగిన వారు మాత్రమే మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది.
కానీ కొన్ని ప్రశ్నలకు కేటాయించిన సమయం సరిపోదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని భావం చెడిపోకుండా
సంక్షిప్తంగా రాయగలగాలి. ఇక్కడ ప్రజెంటేషన్ లో ప్రతిభ ప్రదర్శించిన వాళ్లు పోటీలో ముందు ఉండగలుగుతారు.
పాలిటీ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు కూడా నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. ఒక అధికారికి ఉండాల్సిన
పరిపాలన పరమైన నాలెడ్జ్ ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉన్నాయని చెబుతున్నారు. సమకాలీన సంఘటనల
అనువర్తన కోణంలోనే ప్రశ్నలు అడిగారు. అభ్యర్థులు పాలిటీ కోణంలో సూటిగా జవాబులు రాసి వదిలేస్తే సరిపోదు.
వాటిని సమకాలీన అంశాల ఆధారంగా విశ్లేషించగలగాలి. ఇందుకు అభ్యర్థికి సమగ్ర అవగాహన అవసరమవుతుంది.
పేపర్ – 3 
సిలబస్ పరిధిలో, గత 20 సంవత్సరాల పరిణామాలపై తగిన అవగాహన కలిగిన అభ్యర్థులు రాయగలిగిన విధంగా
ఈ పేపర్ – 3 ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రాధాన్యాల పై ప్రశ్నలు ఇవ్వడం అధికారి కావాల్సిన వ్యక్తికి
ఉండాల్సిన లక్షణాలను పరీక్షించే విధంగా ఉంది. ఎక్స్ పెక్టెడ్ ప్రశ్నలు రూపొందించుకొని చదివినవారు, ఛాయిస్ ల
ఆధారంగా అధ్యయనం చేసిన వారు ఈసారి దెబ్బతినే అవకాశం ఉంది. అకడమిక్ గా చదివిన వారు కూడా సంపూర్ణంగా
మార్కులు పొందడం కష్టమే. సిలబస్ పరిధిలోని సబ్జెక్టుపై పూర్తి అవగాహన ఉండి అనువర్తన కోణంలో
జవాబులు రాసిన వారు పోటీలో నిలబడతారు. కటాఫ్ 95 నుంచి 105 ఉండవచ్చు. 
పేపర్ – 4 
సైన్సేతర అభ్యర్థులను ఈసారి పేపర్ – 4 కొద్దిగా ఇబ్బంది పెట్టింది. సెక్షన్ -2 లో కొన్ని ప్రశ్నలు పీజీ స్థాయిలో ఉన్నాయి.
ప్రతి ప్రశ్నలోనూ రెండు పెద్ద ప్రశ్నలను ఇవ్వడం అభ్యర్థులను కంగారు పెట్టింది. సంక్షిప్తంగా సమాధానాలను
రాయగలిగిన సమర్థతపైనే పరీక్ష సాగింది. సెక్షన్ -3 లో అడిగిన కొన్ని ప్రశ్నలకు తగిన సమాచారం సాధారణ అభ్యర్థులకు
అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఈ అనుభవం నేపథ్యంలో సైన్సేతర అభ్యర్థులు ముందు నుంచి ఈ పేపర్ పై ఎక్కువ
శ్రద్ధను పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. పోటీలో నిలబడే కటాఫ్ 75 నుంచి 85 మార్కులు ఉండవచ్చు. 
పేపర్ – 5 
గణితం అభ్యర్థులకు సైతం కొరుకుడు పడని విధంగా పేపర్ – 5 లో కొన్ని ప్రశ్నల తీరు ఉంది. సంభావ్యతలపై
ఇచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను సందిగ్ధంలో పడేశాయి. సమాధానాలు రాకపోవడంతో కొందరు తర్వాతి ప్రశ్నలు
సరిగా రాయలేకపోయారు. తేరుకునేలోగా సమయం మించిపోయింది. మూడో సెక్షన్ లో పేరాగ్రాఫ్ తో సంబంధం లేని
ప్రశ్నలను ఇవ్వడం కూడా అభ్యర్థులను కంగారు పెట్టింది. మొదటి సెక్షన్ లో 25 నుంచి 35 మార్కులు, రెండో సెక్షన్ లో
40, మూడో సెక్షన్ లో 30 నుంచి 35 మార్కులు తెచ్చుకున్న వాళ్లు పోటీలో నిలబడగలుగుతారు. మొత్తం మీద ఈ
పేపర్ లో 105 నుంచి 115 కటాఫ్ ఉండవచ్చని భావిస్తున్నారు. విస్తృత సిలబస్ పై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవడంతోపాటు,
భావ వ్యక్తీకరణ సూటిగా, సంక్షిప్తంగా ఉండాలని ఈ పేపర్లన్నింటినీ పరిశీలిస్తే తెలుస్తుంది. సమయాన్ని అదుపులో
ఉంచుకోడానికి రైటింగ్ ప్రాక్టీస్ అవసరాన్ని కూడా అభ్యర్థులు గుర్తించి అధ్యయన వ్యూహాలను రూపొందించుకోవాలి. 

 

 
 
                                                               
Powered By:MAHESH