కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పోస్టల్ ఉద్యోగాలకు ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం ప్రజల మధ్య సమాచారాన్ని చేరవేస్తూ ప్రజలకు చాలా దగ్గరగా వ్యవహరించే అవకాశం ఈ ఉద్యోగం వల్ల లభిస్తుంది. పోస్టల్ కార్యకలాపాల సక్రమ నిర్వహణ కోసం ఖాళీలు ఏర్పడినప్పుడు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రకటన విడుదల చేస్తుంది. వీటిలో ప్రధానమైనవి... 
1) పోస్టల్ అసిస్టెంట్స్. 
2) సార్టింగ్ అసిస్టెంట్స్. 
3) పోస్టల్ అసిస్టెంట్ (ఎంఎంఎస్). 
4) పోస్టల్ అసిస్టెంట్ (సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్ -ఎస్‌బీసీవో).

కేవలం ఇంటర్ విద్యార్హతతోనే ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఒక్క రాత పరీక్షలో సరైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే చాలు. ఆ మార్కుల ఆధారంగా దాదాపు ఉద్యోగంలోకి నేరుగా ప్రవేశించవచ్చు. ఈ మేరకు పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది.

చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి భావి జీవితానికి చక్కటి పునాది వేసుకునే అవకాశం కల్పిస్తున్న పోస్టల్ ఉద్యోగాలకు కావాల్సిన అర్హతలేమిటి; పరీక్ష ఎలా జరుగుతుంది తదితర అంశాల గురించి తెలుసుకుందాం.

అర్హతలు ఏమిటి?

అసిస్టెంట్స్ హోదా పోస్టులకు ఇంగ్లిష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు, ఓబీసీలకు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు అవసరం. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. తమ ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడం బాగా వచ్చి ఉండాలి.

ఎపిక విధానం?

అభ్యర్థులను పేపర్ -1 రాత పరీక్ష (ఆబ్జెక్టివ్- ఇంగ్లిష్ మీడియం), పేపర్ -2 స్కిల్ టెస్టుల ద్వారా నియమిస్తారు. 
* పేపర్-1: రాత పరీక్ష (ఆప్టిట్యూడ్ టెస్ట్) వివరాలు...

విభాగాలు
సబ్జెక్టు
ప్రశ్నలు
మార్కులు
పార్ట్ -ఎ జనరల్ నాలెడ్జ్ 25 25
పార్ట్ -బి మ్యాథమెటిక్స్ 25 25
పార్ట్ - సి ఇంగ్లిష్ లాంగ్వేజ్, గ్రామర్ 25 25
పార్ట్ -డి రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ 25 25

* కేటాయించే సమయం - 2 గంటలు. 
*మొత్తం ప్రశ్నలు - 100, మొత్తం మార్కులు - 100. 
*నోట్: నెగిటివ్ మార్కులు లేవు.

ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఉండదు:

వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి కనీస విద్యార్హతలు ఉన్నాయో లేదో చూస్తారు. వీరి నిబంధనల ప్రకారం ఓసీలకు ఇంటర్లో 60 శాతం, ఎస్సీ, ఎస్సీటలకు 45 శాతం, ఓబీసీలకు 55 శాతం మార్కులు ఉండాలి. ఈ మార్కులను కేవలం ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు అభ్యర్థులను పిలిచేందుకు మాత్రమే పరిశీలిస్తారు. మెరిట్ లిస్ట్ తయారీలో ఇంటర్ మార్కులకు ఎలాంటి వెయిటేజీ ఇవ్వరు.

ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అభ్యర్థికి కనీసం ఎన్ని మార్కులు రావాలి?

ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో కింది విధంగా మార్కులు రావాలి. 
1) ఓసీలకు 40 శాతం. అంటే ప్రతి విభాగంలో 10 మార్కులు (సగటును 40 శాతం) రావాలి. 
2) ఎస్సీ/ ఎస్టీలకు 33 శాతం. అంటే ప్రతి విభాగంలో 8 మార్కులు (సగటున 33 శాతం) రావాలి. 
3) ఓబీసీలకు 38 శాతం. అంటే ప్రతి విభాగంలో 9 మార్కులు (సగటున 33 శాతం) రావాలి.

* కంప్యూటర్/ టైపింగ్ టెస్ట్:

రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ 30 నిమిషాల సమయం కేటాయిస్తారు టైపింగ్ కు 15 నిమిషాలు, డేటా ఎంట్రీ వర్క్‌కు 15 నిమిషాలు). అభ్యర్థి ఎంచుకున్న భాషకు (ఇంగ్లిష్/ హిందీ) అనుగుణంగా ఇంగ్లిష్‌లో 450 పదాలతో కూడిన ఒక వ్యాసం లేదా 375 పదాలతో కూడిన హిందీ వ్యాసాన్ని నిర్ణీత సమయంలో టైప్ చేయాలి. నిమిషానికి కనీసం 30 ఇంగ్లిష్ పదాలు/ 25 హిందీ పదాల స్పీడ్ ఉండాలి. టైపింగ్ టెస్ట్, డేటా ఎంట్రీ టెస్ట్‌లను కంప్యూటర్ కీ బోర్డ్ మీదనే నిర్వహిస్తారు. టైప్ రైటర్ మీద కాదు.

తుది ఎంపిక:

కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ (పేపర్ -2)లో కూడా అర్హత సాధించిన తర్వాత ఆప్టిట్యూడ్‌లో సగటున అభ్యర్థి చూపిన ప్రతిభను ఆధారంగా చేసుకుని ఎంపిక చేస్తారు.

సిలబస్ - ప్రిపరేషన్ టెక్నిక్స్

పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో ఇంటర్వ్యూతో పనిలేకుండా రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా నేరుగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. స్కిల్ టెస్ట్‌లో కనీస సామర్థ్యాన్ని ప్రదర్శిస్తే చాలు. కాబట్టి రాత పరీక్ష ఎంతో కీలకమైనదిగా గుర్తించాలి. పరీక్షలో ప్రతి అంశంలోనూ మంచి మార్కులు సాధించడానికి తగిన విధంగా సాధన చేయాలి. దీనికోసం పటిష్ఠమైన ప్రణాళిక అవసరం. సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుని తనలోని బలాలను, బలహీనతలను అంచనా వేసుకుని ఏ విభాగానికి ఎక్కువ సమయం కేటాయించాలో గమనించాలి. అన్ని సబ్జెక్టుల ప్రాథమిక అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి.

1) జనరల్ నాలెడ్జ్: దీన్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకనమిక్స్, జనరల్ పాలిటీ, భారత రాజ్యాంగం, సైన్స్, పర్యావరణం, కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి.

ప్రిపరేషన్: జనరల్‌నాలెడ్జ్‌లో మంచి మార్కుల కోసం కనీసం 5 నెలల ముందు నుంచి కరెంట్ ఈవెంట్స్‌పై పట్టు సాధించాలి. దీనికోసం రోజూ ఆంగ్ల, ప్రాంతీయ భాష దిన పత్రికలను చదవాలి. ప్రధానమైన సంఘటనలపై ప్రత్యేకంగా బిట్స్ తయారు చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల కరెంట్ అఫైర్స్‌పై మంచి అవగాహన ఏర్పడుతుంది. ఇక హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ రాజ్యాంగం తదితర అంశాలపై పట్టు సాధించడానికి 6 నుంచి ఇంటర్ వరకు ఆయా సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలను నిశితంగా చదవాలి. ఇక్కడ కూడా ముఖ్యమైన పాయింట్లపై విడిగా నోట్సు రాసుకోవాలి. బిట్ బ్యాంక్‌లను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా పరీక్ష దగ్గర కొచ్చే కొద్దీ ఈ ప్రాక్టీస్ పెంచాలి. దీనివల్ల సరైన సమాధానాన్ని వెంటనే గుర్తించగలుగుతారు. వేగంగా గుర్తిచడం అలవాటు అవుతుంది. నిర్దిష్ట కాల పరిమితుల్లో రివిజన్ చేయడం కూడా అవసరం.

2) మ్యాథమెటిక్స్: దీన్లో నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, డెసిమల్స్, కరెక్షన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పర్సెంటేజీ, యావరేజీ, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంటాయి.

ప్రిపరేషన్: మ్యాథ్స్ పేపర్లో మంచి మార్కులు సంపాదించాలంటే ప్రాథమిక సూత్రాలపై పూర్తి అవగాహన ఉండాలి. ఎక్కాలు (టేబుల్స్) 20 లేదా 25 వరకూ గుర్తుంచుకోవాలి. ప్రాథమిక సూత్రం అర్ధమైతే ఎలాంటి పెద్దపెద్ద లెక్కనైనా సులభంగా సాధించవచ్చు. ఈ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఆరు నుంచి పదివరకూ ఉన్న పుస్తకాల్లో మ్యాథ్స్‌ను ప్రాక్టీస్ చేయడం వల్ల పూర్తి ప్రయోజనం ఉంటుంది. ప్రాథమిక సూత్రాలన్నింటికీ విడిగా ఒక నోట్స్ తయారుచేసుకోవాలి. తరువాత మననం చేయాలి. ......

3) ఇంగ్లిష్: దీన్లో గ్రామర్ (ప్రిపొజిషన్స్, యాడ్‌వెర్బ్స్, కంజెంక్షన్స్, డైరెక్ట్/ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, సింగ్యులర్ అండ్ ప్లూరల్, యాంటోనిమ్స్/సినానిమ్స్ మొదలైనవి ఉంటాయి.

ప్రిపరేషన్: ఇంగ్లిష్ అంటే చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులు భయపడుతుంటారు. అందరినీ దృష్టిలో ఉంచుకునే ప్రశ్నపత్రం రూపొందిస్తారు. కాబట్టి భయపడకుండా ఇంగ్లిష్ పై పట్టు సాధించేందుకు ప్రయత్నించాలి. ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పర్చుకుని వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి.

4) రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ

దీన్లో కోడింగ్ - డీ కోడిండ్, బ్లడ్ రిలేషన్స్, లెటర్ సీక్వెన్సెస్, సీటింగ్ అరేంజ్‌మెంట్, స్టేట్‌మెంట్స్ అండ్ కంక్లూజన్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, అజెంప్షన్స్, సిలాజిజమ్స్ మొదలైనవి ఉంటాయి.

ప్రిపరేషన్: సమస్య పరిష్కారంలో అభ్యర్థి ఆలోచన ఏ విధంగా ఉంటుందో పరిశీలించడానికి ఈ ప్రశ్నలు ఇస్తారు. రీజనింగ్‌లో మంచి మార్కులు రావాలంటే మార్కెట్లో దొరికే ప్రామాణిక రీజనింగ్ మెటీరియల్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.

మోడల్ పేపర్ల సాధనతో ఎంతో ప్రయోజనం

ఏ పరీక్షలోనైనా విజయం సాధించడానికి మోడల్‌పేపర్లను ప్రాక్టీస్ చేయడం అత్యవసరం. మెటీరియల్, బిట్‌బ్యాంక్ వంటివి చదవడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా సబ్జెక్టులపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. మోడల్ పేపర్ల సాధన ద్వారా ప్రశ్నలకు సమాధానాలను నిర్ణీత సమయంలో గుర్తించడం అలవాటు అవుతుంది. ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో అర్ధమవుతుంది. ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు/ టాపిక్స్ మీద మరింత శ్రద్ధ పెట్టాలి.

దరఖాస్తు విధానం:

ప్రకటన వెలువడిన తర్వాత అన్ని హెడ్ పోస్టాఫీసులలో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచుతారు. వీటికి సంబంధిత అధికారులు సూచించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని వివరాలతో దరఖాస్తును పూర్తిచేసి విద్యార్హతలను, ఇతర అర్హతలను తెలిపే సర్టిఫికెట్‌కాపీలను జతచేసి ఢిల్లీకి పంపాలి.

నోట్: ఏపీలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబరు 1తో ముగిసింది.

చిరునామా: Direct Recruitment Cell, New Delhi HO, New Delhi - 110001

వెబ్‌సైట్: www.indianpost.gov.in

 

                                                                       

Powered By: Mahesh